America | ట్రంప్ కు నిరసన సెగలు .. 50 రాష్ట్రాల‌లోనూ ఆందోళ‌న‌లు

వాషింగ్ట‌న్ – అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అమెరికన్లకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ట్రంప్‌ తీరును మెజార్టీ జనం తప్పుపడుతున్నారు. అమెరికాను నాశనం చేయొద్దని కోరుతున్నారు. అమెరికాలో రాచరికం లేదు, ట్రంప్‌ రాజు కాదు అంటూ జనం గొంతెత్తి నినదిస్తుండడం గమనార్హం. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆదివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జనం వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వైట్‌హౌస్‌ ఎదుట, టెస్లా కార్యాలయాల వద్ద, నగరాల్లోని ప్రధాన సెంటర్లలో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. ట్రంప్‌ వ్యవహార శైలిపై ఆగ్రహం వెళ్లగక్కారు. చాలాచోట్ల ర్యాలీలు జరిగా యి. ఈ నిరసన ఉద్యమం 50501 గా పేరు పొందింది. ;50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం అనేదే దీని అర్థం. సరిగ్గా 250 ఏళ్ల క్రితం అమె రికాలో ఇదే రోజు విప్లవ యుద్ధం ఆరంభమైంది.

బ్రెగో గార్సియాను వెనక్కి రప్పించాలి

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(డోజ్‌) పేరిట ట్రంప్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆదివారం నాటి ప్రజాందోళనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎల్‌సాల్వెడార్‌ దేశానికి చెందిన బ్రెగో గార్సియా అనే వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల బలవంతంగా స్వదేశానికి పంపించింది. ఈ ఉదంతాన్ని అమెరికన్లు తప్పుపట్టారు. గార్సియాను తిరిగి అమెరికాకు రప్పించాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ను ఎల్‌సాల్వెడార్‌కు తరిమేయాలంటూ కొందరు తేల్చిచెప్పారు. ప్రజల నిరసనలు చాలావరకు శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియరాలేదు.

నో కింగ్స్ అని రాసి ఉన్న ప్లకార్డులు జనం ప్రదర్శించారు. ట్రంప్‌ రాచరిక పోకడలు ప్రదర్శిస్తున్నారంటూ పరోక్షంగా మండిపడ్డారు. ట్రంప్‌ పనితీరుకు 45 శాతం సానుకూలత . మొదటి త్రైమాసికంలో ట్రంప్‌ పనితీరు పట్ల ఇటీవల నిర్వహించిన గ్యాలప్‌ సర్వేలో 45 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆయన అధ్యక్షుడైనప్పుడు తొలి త్రైమాసికంలో ఆయన పనితీరుకు 41 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అంటే ఈసారి ప్రజాదరణ కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ, 1952 నుంచి 2020 దాకా అధ్యక్షులుగా పనిచేసిన నేతల తొలి త్రైమాసికం పనితీరుకు సగటున 60 శాతం జనామోదం లభించింది. అంటే వారితో పోలిస్తే ట్రంప్‌ వెనుకబడే ఉన్నారు. ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అప్రూవల్‌ రేటింగ్‌ 47 శాతంగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అది ఇప్పుడు 43 శాతానికి పడిపోయింది.

Leave a Reply