భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేలా అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాచకొండ విష్ణు వర్దిని శంకర్ గౌడ్ తెలిపారు. గురువారం బడా భీమ్‌గల్ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్థానికుడు కాదని, గెలిస్తే అందుబాటులో ఉండనని చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు. ఇదే నా స్వగ్రామం, ఇక్కడే నా ఇల్లు ఉంది. నేను ఇక్కడే ఉంటూ ప్రజలకు సేవ చేస్తాను అని స్పష్టం చేశారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఓటు అనే శక్తితో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. గ్రామ దేవతపై ప్రమాణం చేసి మాట్లాడుతూ, “సర్పంచ్‌గా గెలిచినా ఒక్క రూపాయికీ అవినీతికి పాల్పడను. ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను’’ అని చెప్పారు.
గ్రామ సమస్యలు పరిష్కరించడం కోసం వస్తున్నానని, స్వప్రయోజనాల కోసం కాదు అని స్పష్టం చేశారు. బడా భీమ్‌గల్‌ను మండలంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్రచారంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

