మక్తల్, ఏప్రిల్ 14 (ఆంధ్రప్రభ ) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే ప్రజా ప్రభుత్వ విధానమని మక్తల్ ఎమ్మెల్యే డా.శ్రీహరి పేర్కొన్నారు. అంబేద్కర్ దూరదృష్టితోనే నేడు మనమంతా స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నామని అభివృద్ధి ఫలాలు పొందుతున్నామన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఇవాళ మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో 167వ జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈదేశానికి భవిష్యత్తులో ఏమి కావాలి, ఎటువంటి బాటలో నడవాలి అని బీద, బడుగు, బలహీన వర్గాలు, తాడిత, పీడిత ప్రజలందరూ కూడా ఆర్థిక వ్యత్యాసం లేకుండా సమసమాజంలో అందరూ ఒక్కటిగా బతకడానికి ఏమి కావాలని ఒక దూరదృష్టితో ఆలోచన చేసి అంబేద్కర్ రచించారని కొనియాడారు. రాజ్యాంగం భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిన డా.అంబేద్కర్ మన దేశంలో పుట్టడం, మన అందరికీ ఆదర్శనీయులు కావడం మన అందరి పూర్వ జన్మ సుకృతమన్నారు. ఇంతటి గొప్ప మహనీయుడి 134వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కంకణబద్దులు కావాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రకాంత్ గౌడ్, బోయ రవికుమార్, బి.గణేష్ కుమార్, శంషుద్దీన్, పసుల రంజిత్ రెడ్డి, గాయత్రి అనిల్ కుమార్, కావలి తాయప్ప, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.