విమాన ప్రయాణం.. సున్నితం.. సురక్షితం

విమాన ప్రయాణం.. సున్నితం.. సురక్షితం
- మోడీ.. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా..
- కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు..
- విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కేఫ్ ప్రారంభం
(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విమాన ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, సురక్షిత విమాన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Kinjarapu Rammohan Naidu) పేర్కొన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కేఫ్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు.

విమానాశ్రయాల్లో ఆహారం, బేవరేజ్‌లు కేవలం రూ.10 నుండి అందుబాటులో ఉండడం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆలోచన.. అందరికీ అందుబాటులో, సునిశితమైన విమాన ప్రయాణం ఆవిష్కరణలో ఇది మరో బలమైన అడుగుగా రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు.
ఈ సందర్భంగా విజయవాడ (Vijayawada) విమానాశ్రయంలో ప్రయాణికులతో మాట్లాడి, వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే అమ్మ పేరుతో – ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్, ఎ.ఏ.ఐ. అధికారులు మరియు విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు.
