జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
చిత్తూరు, ఆంధ్రప్రభ : రైతాంగ సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతన్నా.. మీ కోసం అవగాహన కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. మార్చి 16 నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. జిల్లాను దృష్టిలో పెట్టుకొని జిల్లా అంతటా గ్రామాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులు, వాతావరణ మార్పులు, పంటల సాగులో కొత్త సాంకేతికతల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళి వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రైతు సేవా కేంద్రాల పరిధిలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, సహకార, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల అధికారులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
గ్రామాల వారీగా రైతులను కలుసుకుని వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై సూచనలు ఇవ్వనున్నారు. రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు, పంటల ఉత్పాదకత పెంపు చర్యలు, ఆధునిక సాగు విధానాలపై అధికారులు వివరాలు అందజేయనున్నారు. అగ్రి టెక్, డీప్ టెక్ ఆధారిత ఆధునిక సాగు విధానాలపై కూడా రైతులకు అవగాహన కల్పించనున్నారు. మట్టి పరీక్షలు, పంటల ఎంపిక, నీటి వినియోగం, పంటల బీమా, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై నిపుణులు రైతులకు మార్గనిర్దేశం చేయనున్నారు. పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం, పశుగ్రాసాల సాగు, సేంద్రియ పదార్థాల పెంపు, తేమ సంరక్షణ వంటి అంశాలపై రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. భూమిలో సేంద్రియ పదార్థాలను పెంచడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవడం, భూమి ఉరుకును కాపాడుకోవడం వంటి అంశాలపై కూడా నిపుణులు రైతులకు వివరాలు తెలియజేయనున్నారు. అలాగే పశుగ్రాసాల సాగు కోసం వివిధ రకాల విత్తనాల వినియోగంపై కూడా రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి కారణాల వల్ల వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
వేసవి చినుకులను సద్వినియోగం చేసుకోవడం, వర్షాకాలానికి ముందు సాగు చేయదగిన పంటల ఎంపిక, భూమి, నీటి సంరక్షణ పద్ధతులపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నారు. రైతుల సమస్యలను గ్రామస్థాయిలోనే తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. రైతులు తమ సమస్యలను అధికారులు ముందు ఉంచి తక్షణ పరిష్కారం పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విధంగా కూడా అవగాహన కల్పించనున్నారు.
జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే విధంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, పంటల ఉత్పాదకత పెంపు చర్యలను అమలు చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలను సూచించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా అధికారులు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త డైరెక్టర్ మురళి కోరారు.
