బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు
బస్సుకిందపడి విద్యార్థిని మృతి
ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు
గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద ఘటన
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఓ విద్యార్థిని టెన్త్ పరీక్ష రాసి వస్తూ తీరని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం పరీక్షకు వెళ్లిన తన కుమార్తె అన్నయ్యతోపాటు వస్తాది అనుకుంటే చావు కబురు వచ్చిందని ఆ తల్లిదండ్రుల విలపిస్తున్న తీరు పలువుర్ని కంట తడి పెట్టించింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థిని ప్రభాతి ఛత్రియ (16) మృతి చెందింది. ఆమె అన్నయ్య సుమన్ ఛత్రియకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిందిలా…
గచ్చిబౌలిలో టెన్త్ పరీక్షలు రాసిన తన చెల్లి ప్రభాతిని తీసుకు రావడానికి అన్నయ్య సుమన్ పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష అనంతరం ఇద్దరు ద్విచక్ర వాహనంపై లింగపల్లి వైపు బయలుదేరారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు క్రాస్ చేస్తుండగా చక్రాల కింద ద్విచక్ర వాహనం పడిపోయింది. చక్రల కింద పడిన ప్రభాతి అక్కడికక్కడే మృతి చెందగా, పక్కకు పడిన ఆమె అన్నయ్య సుమన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన సుమన్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.