ACB Raids | ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో రైడ్స్

ACB Raids | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇవాళ‌ మెరుపు సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. విజయనగరంలో ఓ హోంగార్డు, చిత్తూరు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేప‌థ్యంలో విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు ఎన్.శ్రీనివాసరావు ఇళ్ల‌లో సోదాలు చేపట్టారు. ఆయన ఆస్తుల చిట్టాను వెలికితీసే పనిలో పడ్డారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని మొత్తం నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

అలాగే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న నల్లపోగు తిరుమలేశ్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక సాధారణ గ్రేడ్-2 ఉద్యోగి హోదాలో ఉండి, కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదులతో అధికారులు ఈ సోదాలు చేపట్టారు.

రేణిగుంట, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి నేతృత్వంలో మొత్తం ఐదు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

Leave a Reply