జిల్లాలో ఏసీబీ అధికారుల విస్తృత సోదాలు
… దాడులతో అధికారుల గుండెల్లో గుబులు
… సెలవులు పెట్టి పరార్ అవుతున్న కొందరు
… ప్రభుత్వాలు మారినా తీరు మారని అవినీతిపరులు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం… ఎందు వెతికినా అవినీతే కలదు… అన్న రీతీ లో కొంతమంది అధికారులు వ్యవహరించటం విశేషం. జిల్లాలో ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు అధికమయ్యాయి. జిల్లాలో ఆళ్లగడ్డలోని ఆత్మ ఊర్లోను, నంద్యాలలోనూ గత ఆరు నెలల కాలంలో ఐదుగురి అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టు పడటం విశేషం.
నంద్యాల జిల్లాలో మున్సిపాలిటీ కార్యాలయంలోనూ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, ఆత్మకూరులోని ఆర్డీవో కార్యాలయం, ఆళ్లగడ్డలోని విద్యుత్తు కార్యాలయం, ఆళ్లగడ్డలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం, డోన్‌లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల భరతం పట్టారు. ఇటీవల కాలంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారి సబ్ రిజిస్టార్ లంచం తీసుకుంటూ పట్టుబడటం విశేషం.
ప్రభుత్వ శాఖల్లో గుబులు… మారిన పాలన?.. మార్పు లేని అధికారుల అవినీతిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెలిబుచ్చటం విశేషం. కూటమి సర్కారు వచ్చినా లంచాలకు మరిగిన అవినీతి తిమింగలాల్లో మార్పు రాకపోవడంతో వారిపై ప్రజలు మండిపడుతున్నారు. ఏసీబీ మెరుపు దాడులతో ప్రభుత్వ శాఖల అధికారులకు చెమటలు పడుతున్నాయి. కొంతమంది అధికారులు అయితే సెలవు పెట్టి వెళ్లిపోవటం విశేషం. అధికారుల దాడుల్లో చుక్కల భూములు, ప్రభుత్వ భూములకు ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు తీసుకుని నిబంధనలను తుంగలో తొక్కారని ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. డబ్బుల చెల్లింపులకు డిజిటల్ దారి కనుగొన్నారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి గూగుల్ పే ద్వారా నేరుగా అధికారులకు లంచాలు అందినట్లు ఆధారాలు లభ్యం కావటం ఆ కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడం విశేషం. సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ పేపర్లు మాయం పై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే.

లంచం ఇవ్వొద్దు.. : ఏసీబీ డిఎస్పీ సోమన్న..
..పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ప్రభుత్వాధికారులకు లంచాలు ఇవ్వొద్దు. ఫోన్ పే ద్వారా కూడా డబ్బులు ఇవ్వ రాదు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు, సిబ్బంది డబ్బులు అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064, 14400 కు కాల్ చేయండి. వారి పేర్లను రహస్యంగా ఉంచుతాం.

