ACA | మళ్లీ తిరిగి విజయవాడకు ఏసీఏ…

ACA | మళ్లీ తిరిగి విజయవాడకు ఏసీఏ…
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తిరిగి విజయవాడ నుండే తన కార్యకలాపాలు అతి త్వరలోనే ప్రారంభించనుంది. ఏపీలో క్రీడాభివృద్ధితో పాటు క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడం వారి నైపుణ్యాన్ని వెలికి తీయడం అత్యుత్తమ క్రీడాకారులుగా తయారు చేసేందుకు ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాజధానికి దగ్గరగా విజయవాడ నుండే మళ్లీ ప్రారంభం కానుంది.
దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీఏ విస్తృత కార్యకలాపాలను విజయవాడ నుండే కొనసాగిస్తూ వచ్చేది. అయితే గత వైసిపి ప్రభుత్వం హయాంలో వైజాగ్ రాజధాని అంటూ చేసిన హడావుడిలో క్రికెట్ అసోసియేషన్ కూడా హడావిడిగా వైజాగ్ కి తరలించారు.
ఏసీఏ బైలాస్ ను దిక్కరిస్తూ బైలాసును మార్చి వైజాగ్ కు తరలించడం అప్పుడిలో తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారింది. వైజాగ్ తరలింపు విషయంలో ఇటు క్రీడాకారులతో పాటు క్రీడా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ వాటిని కాతర చేయకుండా అప్పటి ప్రభుత్వం ఏసిఏ ను వైజాగ్ కి తరలించింది.
మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరన ఉన్న ప్రాంతంలో ఏసీఏ ఉండడం ఇటు కృష్ణ గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ క్రీడాకారులకు క్రీడా సంఘాలకు ఈ తరలింపు చాలా ఇబ్బందికర పరిస్థితులను తీసుకువచ్చింది.
ACAకు నూతన జవసత్వాలు..
ఆంధ్ర క్రికెట్ అధ్యక్షుడిగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఏసీఏకు నూతన జవసత్వాలు వచ్చాయి. అప్పటివరకు స్తబ్దుగా ఉన్న ఏసీ ఏ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ఏసీ అధ్యక్షుడు శివనాథ్ సారధ్యంలో ఐపీఎల్ మ్యాచ్లు విశాఖపట్నంలో జరగడంతో పాటు, విశాఖపట్నంలోని స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు.
అలాగే ప్రతి జిల్లాలో కొత్త స్టేడియాలు నిర్మించడం లేదా ఉన్న స్టేడియం లను ఆధునికనించడం ఇలా ఎన్నో కార్యక్రమాలను విస్తృతం చేశారు. వీటితోపాటు ఐపీఎల్ లో అత్యుత్తమ క్రీడాకారులను నిలపడం కూడా విశేషం. ఏసీఏకు అంతర్జాతీయ కోచ్ ను కూడా మొట్టమొదటిసారిగా కేశినేని శివనాథ్ హయాంలోనే నియమించడం. ఇలా గడిచిన 15 నెలలుగా ఏసీఏ విస్తృతంగా కార్యకలాపాలను నిర్వహించడంతోపాటు నైపుణ్యం కలిగిన క్రీడాకారులను కూడా తీర్చిదిద్దడంలో సఫలీకృతం అయింది.
డిసెంబర్ నుండి విజయవాడలోనే…
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలు ఇక డిసెంబర్ నుండి విజయవాడలోనే కొనసాగులు ఉన్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ నగరంలోని పటమట లంకలో ఒక అత్యధిక హంగులతో భవనాన్ని సైతం సిద్ధం చేశారు.
బుధవారం ఈ భవనంలో ఏసీ అధ్యక్షుడు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ ప్రత్యేక పూజలను సైతం నిర్వహించారు. ప్రస్తుతం భవనంలో ఇంటీరియర్ పనులు జరుగుతుండగా డిసెంబర్ లో ఎస్ ఏ కార్యాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.


