జన్నారం (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఓ ఇంట్లోని ఏసీ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో… మంటలు చెలరేగి విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి.
ఎనగందుల సతీష్ గౌడ్ అనే వ్యక్తి నివాసంలో జరిగిన ఈ ఘటనలో బట్టలు, మంచం, పరుపులు, ఏసీ పూర్తిగా కాలిపోయాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న రూ.1 లక్ష నగదుతో కలిపి దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. కానిస్టేబుల్ ముత్తె శ్రీనివాస్, అగ్నిమాపక లీడింగ్ ఫైర్ మెన్ రవీందర్ రెడ్డి, డీపీఓ ప్రశాంత్, ఫైర్ మాన్ మధుకర్, ఉదయ్ లు ఫైర్ ఇంజిన్ తో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఘటనపై సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎమ్మార్వో గంగరాజులు అక్కడికి చేరుకొని పంచనామ నిర్వహించారు. ప్రమాదానికి సంబంధించిన నష్టాన్ని అధికారులు అంచనా వేశారు.
క్షణాల్లో….
ఇటీవలి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలో షార్ట్ సర్క్యూట్‌లు, ఎలక్ట్రిక్ పరికరాల్లో లోపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాత ఇళ్లలో వైర్లు, ప్లగ్ పాయింట్లు బలహీనపడటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికం.
ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలను సురక్షితంగా వాడటం, నిరంతరం సర్వీసింగ్ చేయించడం, వర్షపు నీరు ఇంటి లోపలికి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. అయితే, ఈ తరహా ప్రమాదాలు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయి.
రోజువారీ కష్టపడి సంపాదించి.. కొన్న వస్తువులు క్షణాల్లో కాలిపోవడం కుటుంబాలను కుదేలయ్యేలా చేస్తుంది. నగదు నష్టం, గృహోపకరణాల నష్టం కలిపి తిరిగి కోలుకోవడానికి సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే ఇంటి ఇన్సూరెన్స్, ఎలక్ట్రికల్ సేఫ్టీ చెకప్‌లు వంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ విధమైన అనుకోని ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చు.
విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు నిర్లక్ష్యం ప్రాణాపాయం కలిగించవచ్చు. ప్రతి ఇంట్లో సర్క్యూట్ బ్రేకర్ (MCB), ఫ్యూజ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మన ఆస్తులను, ప్రాణాలను కాపాడగలవు.