ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన తుఫాన్ వాహ‌నం..

ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన తుఫాన్ వాహ‌నం..

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండ‌ల ప‌రిధిలోని 65వ జాతీయ రహదారి పై ఆదివారం తెల్లవారుజామున‌ చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండల పరిధిలోని చేర్యాల గేటు వద్ద ముందుగా వెళ్తున్నఆర్టీసీ బస్సును వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం (ఏపీ15టీబీ 9722) ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ప్ర‌యాణిస్తున్ననారాయణఖేడ్ మండ‌లం చాంద్‌ఖాన్ ప‌ల్లికి చెందిన శ‌నిగ‌రం బాలయ్య (52) అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో మెద‌క్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్ కు చెందిన ప్రవీణ్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన ఫరీద్, సిర్గాపూర్ గ్రామానికి చెందిన సీతారాం, రాయచూరుకు చెందిన కాలప్పకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ద‌వాఖాన‌కు పోలీసులు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి వెల్ల‌డించారు.

Leave a Reply