- సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత కళ
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల ఆలయంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే చేనేత కార్మికుడు బుధవారం అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించారు.
నల్ల విజయ్ కుమార్ కుటుంబం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ ఇంటి దేవత శ్రీ కనకదుర్గను సందర్శించి, ఆమె ఆశీస్సులు పొంది.. అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు చీరను బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నేపథ్యంలో అగ్గిపెట్టెతో ఇమిడే పట్టు చీరను భక్తితో అమ్మవారికి సమర్పించారు. చేనేత కళాకారుడు తయారు చేసిన ఈ చీర 100 గ్రాముల బరువు కాగా.. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉంటుంది.
దీనిని పూర్తిగా పట్టు దారాలు, గోల్డ్ జరి వాడడం జరిగిందని.. దీనిని తయారు చేయడానికి దాదాపు ఐదు రోజులు పట్టిందని నల్ల విజయ్ కుమార్ చెప్పారు.
ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.కె. సీనానాయక్ వీరిని అభినందించి, అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి, ప్రసాదాలు అందజేశారు.