డ్రగ్స్‌కు బానిసై ఓ యువకుడు కుటుంబంలోని ఐదుగురిని గంటల వ్యవధిలోనే హతమార్చిన భయానక ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అఫాన్ (23) అనే యువకుడు విచ్చలవిడిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలోనే అఫాన్ మత్తులో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకుందే తడవుగా మొదట నిందితుడు పాంగోడ్ కు చెందిన తన నాన్నమ్మ సల్మా బీవీని ఉదయం హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి మరొక గ్రామమైన ఎస్ఎన్ పురంలో తండ్రి రహీం సోదరుడు లతీఫ్, అతడి భార్య షాహిదాలను హతమార్చాడు.
అక్కడితో ఆగకుండా తన సొంత గ్రామం పుల్లంపరకు వెళ్లి అతడి 13 ఏళ్ల తమ్ముడు అఫ్సాన్ , మరో మహిళ ఫర్సానాతో పాటు స్నేహితుడిని కొట్టి చంపేశాడు. హత్యల అనంతరం నిందితుడు వెంజమూడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే, అఫాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి తల్లి షెమీ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ మేరకు తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.