వైభవంగా లక్ష పుష్పార్చన

మక్తల్ / ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రాత్రి లక్ష పుష్పార్చన, దీపోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త శ్యాంసుందర్ జోషి ఆధ్వర్యంలో, అర్చకులు వంశీకృష్ణ జోషి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కార్తీక దీపోత్సవం సందర్భంగా స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ లక్ష పుష్పార్చన జరిపి అనంతరం సహస్ర దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, కార్తీకమాసంలో చేసిన పుణ్యకార్యాలకు వెయ్యి రెట్లు ఫలం లభిస్తుందని శాస్త్రోక్తంగా వివరించారు.

హరిహరులకు ప్రీతికరమైన ఈ పవిత్ర మాసంలో, బ్రాహ్మణవాడిలో వెలసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి, శ్రీ రాఘవేంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో ఈ వేడుక జరగడం అందరి అదృష్టమని వారు అభిప్రాయపడ్డారు.

“తమసో మా జ్యోతిర్గమయ” అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించడమే దీపప్రజ్వలన లక్ష్యం అని పేర్కొన్నారు. మహామహిమాన్వితమైన స్వామివారి సన్నిధిలో జరిగే ఈ పుష్పార్చనలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి. చారి, సురేంద్ర చారి, విజయేంద్రాచారి, నరేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply