Godavarikhani | మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలి

Godavarikhani | మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలి

  • రామగుండంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పనులను పూర్తి చేయాలి
  • అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎంఎస్. రాజ్‌ఠాకూర్

Godavarikhani | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలంటే మౌలిక వసతులు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ, రామగుండాన్ని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్నికోరారు. మూడు లక్షలకుపైగా జనాభా కలిగిన కోల్‌బెల్ట్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సరిపోవడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రూ.140 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రారంభమైతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు సగటున 2 వేల మంది వరకు అవుట్‌పేషెంట్లు వస్తున్నారని, వారికి అవసరమైన మందులు కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన క్యాథ్ ల్యాబ్‌ను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సంబంధిత మంత్రులను కోరినట్లు తెలిపారు.

పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యం అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధునాతన వైద్య పరికరాలు, నిపుణుల సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థ, ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమల సీఎస్‌ఆర్ నిధులతో ఆసుపత్రుల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. గతంలో సింగరేణి నిధులతో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన మెడికల్ కాలేజీలో మరిన్ని సదుపాయాల కల్పనకు అదనపు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రామగుండం ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేసి, ప్రజలకు సమగ్ర వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

Leave a Reply