Minister | రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Minister | రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
- మంత్రి అచ్చెన్నాయుడు
- అక్కయ్యవలసలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రారంభం
- ఏడాదిలోగా లోపరహితంగా రీ-సర్వే పూర్తి చేస్తాం
Minister | కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : గత పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90శాతం ఈ శాఖకు సంబంధించినవే ఉండటం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే తప్పుల తడకగా మారిందని, వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. “మొన్ననే నేను, జిల్లా కలెక్టర్ కలిసి కూర్చుని ఒక్కరోజులో సుమారు 4,000 రెవెన్యూ సమస్యలను పరిష్కరించాం. ఏడాది కాలంలోగా ఎటువంటి తప్పులు లేకుండా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కొత్త పాస్‌పుస్తకాల మంజూరులో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరిస్తాం” అని హామీ ఇచ్చారు. గత పాలకుల వలె పుస్తకాలపై, సర్వే రాళ్లపై ఫొటోలు వేసుకోకుండా, తాము అధికారిక రాజముద్రతో వీటిని అందజేస్తున్నామని స్పష్టం చేశారు.
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చెన్నైలో ముద్రించిన ఈ- పాస్‌పుస్తకాలను పాస్‌పోర్టు తరహాలో నేరుగా రైతుల ఇంటికే పోస్టల్ ద్వారా పంపేలా భవిష్యత్తులో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పుస్తకంలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూమి వివరాలన్నీ కనిపిస్తాయని, యజమానికి తెలియకుండా ఎవరైనా రికార్డులను టాంపర్ చేయాలని చూస్తే వెంటనే మొబైల్‌కు అలర్ట్ వచ్చేలా భద్రత కల్పిస్తున్నామన్నారు. టెక్కలి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ భూముల కబ్జాలపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అక్కయ్యవలస గ్రామానికి రోడ్డు వెడల్పు చేస్తామని, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇదే వేదికపై పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిన రమేష్, స్థానిక రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
