చిత్తూరు జిల్లా, జిడి నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకులు, కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్‌పై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, వారి ఉనికి తనకు గొప్ప బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
గత 8 నెలలుగా తాను పూర్తిగా పాలనలో నిమగ్నమై ఉన్నానని, దీంతో పార్టీ సభ్యులతో సమావేశానికి అవకాశం లేకుండా పోయిందని వివరించారు. అయితే, ఈరోజు పార్టీ కార్యకర్తలను కలుసుకోవడం సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కార్యకర్తలు తమ ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టే.. 30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరులో టీడీపీ విజయకేతనం ఎగురవేసిందన్నారు. ఈ నేపథ్యంలో క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఈ సమావేశంలో చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు.. పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక నుంచి తాను ఎక్కడ పర్యటనకు వెళ్లినా కార్యకర్తలు, నేతలతో కలుస్తానని… తనకు, కార్యకర్తలకు మధ్య దూరం ఉండదని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.