51k Farmers | కుప్పం ప్రకృతి సాగుకు ప్రపంచ స్థాయి నిపుణుల అభినందన

51k Farmers | కుప్పం ప్రకృతి సాగుకు ప్రపంచ స్థాయి నిపుణుల అభినందన

రసాయన ఎరువులకు స్వస్తి … ప్రకృతి వ్యవసాయంపై రైతుల అసక్తి

51 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం బాట

53,988 ఎకరాల్లో జీవామృతంతో సహజ సాగు

మామిడి నుంచి మిల్లెట్ వరకూ సేంద్రియ ఎరువులే

జిల్లావ్యాప్తంగా ప్రకృతి సాగు విప్లవం

ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా వ్యవసాయం మళ్లీ తన మూలాల వైపు తిరుగుతోంది. రసాయన ఎరువులు, పురుగుమందులతో భూమి అలసిపోయిన వేళ, ప్రకృతిని నమ్ముకున్న రైతుల కృషితో జిల్లాలో వ్యవసాయానికి కొత్త దిశ లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీసీఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చురుగ్గా ప్రోత్సహించబడుతూ, రైతుల్లో అవగాహన పెరుగుతోంది. జీవామృతం, ఘనజీవామృతం, మిశ్రమ పంటల సాగు, మల్చింగ్ వంటి పద్ధతుల ద్వారా రసాయన రహితంగా పంటలు పండిస్తూ రైతులు ఖర్చులు తగ్గించుకుని స్థిర ఆదాయం సాధిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 51,085 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడుతూ, 53,988 ఎకరాల్లో రసాయన రహిత సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద 2047 నాటికి జిల్లాలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రకృతి సాగు కీలకంగా మారింది.

వ్యవసాయ అడవులు, పొలాల చుట్టూ మొక్కలు, దేశీ వృక్షాలు పెంచుతూ నేల ఆరోగ్యం, వాతావరణ సమతుల్యత సాధించాలన్న దిశగా జిల్లా రైతులు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు రసాయనాలతో క్షీణించిన నేలలు ఇప్పుడు మళ్లీ సజీవంగా మారుతున్నాయి.
ప్రకృతి వ్యవసాయం అమలులో భాగంగా నేల ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు. ఆవు పేడ, మూత్రం ఆధారంగా తయారు చేసే జీవామృతం, ఘనజీవామృతం నేలలో సూక్ష్మజీవులను పెంచి పంటలకు అవసరమైన పోషకాలను అందిస్తున్నాయి. విత్తన శుద్ధికి బీజామృతం, తెగుళ్ల నివారణకు వేప కషాయం, పుల్లటి మజ్జిగ, అగ్నిస్త్రం వంటి బయో ఎక్స్‌ట్రాక్ట్స్ విస్తృతంగా వాడుతున్నారు. పంటల వ్యర్థాలను నేలపై కప్పి ఉంచే మల్చింగ్ ద్వారా తేమ నిల్వ ఉండటంతో పాటు కలుపు మొక్కల సమస్య తగ్గుతోంది. పంటల మార్పిడి, మిశ్రమ పంటల సాగు వల్ల నేల సారం రెట్టింపు అవుతోంది.

ఈ పద్ధతులపై రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తున్న తీరును అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు ప్రశంసించడం రైతుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో అమలవుతున్న ప్రకృతి సాగు విధానాలను ప్రపంచ స్థాయి నిపుణులు అభినందించారు.

51k Farmers | ఈ పద్ధతుల వల్ల పంట నాణ్యత మెరుగు

ప్రకృతి వ్యవసాయంతో వ్యక్తిగతంగా సఫలత సాధిస్తున్న రైతులే ఈ ఉద్యమానికి ప్రాణంగా మారుతున్నారు. సోమల మండలం కరకమందకు చెందిన మురళి బీకాం పూర్తి చేసిన వెంటనే వ్యవసాయాన్ని తన జీవన మార్గంగా ఎంచుకున్నారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, 10 ఎకరాల్లో టమోటా, చెరకు, దోస పంటలను విడతల వారీగా సాగు చేస్తున్నారు. ప్రతి పంటకు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, ఘనజీవామృతం, నీమాస్త్రం వంటి కషాయాలతో పంటలను సంరక్షిస్తున్నారు. తక్కువ వ్యయంతో, అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారయ్యే ఈ పద్ధతుల వల్ల పంట నాణ్యత మెరుగుపడటంతో మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. టమోటా సాగులోనే మురళి ఏటా లక్షల రూపాయల ఆదాయం పొందుతూ, కోలారు, వడ్డిపల్లె, పలమనేరు మార్కెట్లకు ఉత్పత్తిని తరలిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యానికి భరోసా ఉంటుందని ఆయన నమ్మకం.

51k Farmers
51k Farmers

ఇలాగే అభ్యుదయ రైతుగా గుర్తింపు పొందిన మరో పేరు పెనుమూరు మండలం దాసరపల్లెకు చెందిన పసపల హరికృష్ణరెడ్డి. దశాబ్ద కాలంగా గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో అత్యధిక దిగుబడులు సాధిస్తూ ఆయన అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన మూడెకరాల పొలంలో జామ, నేరేడు, నిమ్మ, సపోటా, మామిడి, అరటి వంటి పండ్ల తోటలతో పాటు దేవీ వరి వంగడాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. రైతు సాధికార సంస్థలో ఉద్యోగం చేస్తూనే ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించడం విశేషం. దేశీ ఆవులను పెంచుతూ బీజామృతం, జీవామృతం, ఆచ్చాదన, వాపన వంటి విధానాలను అవలంబించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

51k Farmers
51k Farmers

చందన మాధురి జామ రకాన్ని సాగుచేస్తూ ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి పొందుతున్నారు. పండించిన పంటలను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు తరలించి మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు విద్యార్థులు, మహిళా సంఘాలు, రైతులకు శిక్షణలు ఇస్తూ పులిగుంటీశ్వర ప్రకృతి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కృషికి పలు సంస్థల నుంచి పురస్కారాలు లభించాయి.

51k Farmers |రైతుల ఖర్చులు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలతో

పెద్దపంజాణి మండలంలోని లింగాపురం వద్ద సాగవుతున్న తైవాన్ రకం జామ పంట కూడా ప్రకృతి సాగులో సిరులు కురిపిస్తోంది. పలమనేరు చెందిన డాక్టర్ బలరాం కుటుంబం ప్రయోగాత్మకంగా ఈ పంటను సాగు చేయగా, 4.5 ఎకరాల్లో సుమారు 4500 మొక్కలు పెంచుతున్నారు. నాటిన ఆరు నెలలకే కాయలు కాసే ఈ జామ పంట మొదటి ఏడాదిలోనే రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఇచ్చింది. ఏడాది పొడవునా కాయలు కాసే సామర్థ్యం ఉండటం, వాతావరణ మార్పులను తట్టుకోవడం వల్ల రైతులకు ఇది ఆశాజ్యోతి అయింది. మొత్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఒక పద్ధతిగా కాకుండా ఉద్యమంగా మారుతోంది. రసాయనాల వాడకం తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి రావడం, పర్యావరణ సమతుల్యత సాధించడం, రైతుల ఖర్చులు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలతో ఈ సహజ సాగు భవిష్యత్తుకు దారి చూపుతోంది. భూమిని తల్లిలా చూసుకుంటూ, ప్రకృతితో చేతులు కలిపిన చిత్తూరు రైతు… వ్యవసాయానికి కొత్త అర్థం చెబుతున్నాడు.

click here to read పనితీరుపై సీఎం సమీక్ష..

click here to read more

Leave a Reply