- ఏకగ్రీవ గ్రామాలకు కోడ్ వర్తిస్తుంది
- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలు ఉంటుందని, ఏకగ్రీవ గ్రామాల్లోనూ ఎన్నికల కోడ్ అమలు వర్తిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందున, చివరి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు.
ఏకగ్రీవ గ్రామ పంచాయతీల్లోను ఎన్నికల కోడ్ యథాతదంగా అమల్లోనే ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చివరి దశ ఎన్నికల ప్రక్రియ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటున్నందున ఎవరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించవద్దని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి దశ పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా ఉండేలా ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్న అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, చివరి దశ ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేయాలని తెలిపారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.

