బాధ్యతతో విధులు నిర్వర్తించాలి

  • జిల్లా ఎన్నిక‌ల అధికారి

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్నిక‌ల విధులు బాధ్య‌త‌తో నిర్వ‌ర్తించాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ హ‌నుమంతరావు అన్నారు. ఎన్నికల విధులకు, శిక్షణ తరగతులకు హాజరు కాని వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ రోజు జిల్లాలో పంచాయతీ సాధారణ మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి శిక్షణ తరగతులకు ఎవరైనా గైర్హాజరయినా, ఎన్నికల విధులు ఆర్డర్ కాపీ తీసుకోకపోయినా, ఎన్నికల విధులకు హాజరు కాకపోయినా వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

రాజాపేటలో జోనల్, రిటర్నింగ్, ప్రిసైడింగ్, అధికారుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల విధులు చాలా కీలకమైనదని, ప్రతి అంశం పైన క్షుణ్ణంగా అవగాహన కల్పించుకుని విధులు నిర్వహించాలని సూచించారు. తొలి విడతగా ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూర్, బొమ్మలరామారం, తుర్కపల్లి లోని మండలాలలో ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్న నేప‌థ్యంలో స్టేజ్ -2 శిక్షణ లో జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ తరగతులలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి తో కలసి పాల్గొన్నారు.

అన్నిఏర్పాట్లు చేసుకోవాలి!

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమయ పాలనను పక్కగా పాటిస్తూ, అప్రమత్తతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు.

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు,ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply