Taxes | పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలి
- పన్నులు స్వచ్ఛందంగా చెల్లించాలి
- అనుమతి పొందిన లే అవుట్ లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి
మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్
Taxes | అచ్చంపేట, ఆంధ్రప్రభ : పట్టణ ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించి అచ్చంపేట పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అచ్చంపేట మున్సిపల్ (Muncipal) చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు శనివారం కోరారు. గత ఏడాది అంచనాలకు తగ్గట్టు పన్నులు వసూలు కాకపోవడంతో పురపాలికకు రావలసిన 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.50లక్షల అభివృద్ధి నిధులు రాలేదని, దీనివల్ల రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సేకరణ వాహనాల కొనుగోలు, మెయింటెనెన్స్ వంటి అనేక పనులకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఆస్తి పన్ను, కొత్త అసెస్మెంట్లు, రివైజ్ పన్నులు, ట్రేడ్ లైసెన్స్ (Trade Licence) వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిన నేపథ్యంలో తాను శత్రువుగా కనిపిస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరితోనూ తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, పట్టణ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను ప్రజలు, ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని, ఇకమీదట ఎలాంటి ఒత్తిడి ఉండదని, ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించుటకు, నిబంధనల మేరకు మనస్సాక్షితో నిర్మాణాన్ని చేపట్టుటకు ముందుకు రావాలని కోరారు. ఆమోదించిన లేఅవుట్ లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని, నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని కోరారు.ధార్మిక కార్యక్రమాలకు చేయూతనిచ్చిన విధంగానే పట్టణ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ పట్టణ అభివృద్ధికి సరిపడే నిధుల కోసం ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు ఇదివరకే ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.

