AISF | ఆంధ్రప్రభ ఎఫెక్ట్..

AISF | ఆంధ్రప్రభ ఎఫెక్ట్..
- సోషల్ వెల్ఫేర్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘ నాయకులు.
- విద్యార్థి సంఘాలతో కలిసి ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన ఎస్ డబ్ల్యు ఓ అధికారి.
AISF, ఏలూరు, ఆంధ్రప్రభ : బుధవారం ఆంధ్రప్రభలో అక్కడ అన్ని సమస్యలే అనే ప్రచారింపబడ్డ వార్తకు విద్యార్థి సంఘ నాయకులుతో పాటు సంబంధిత అధికారులు స్పందించారు. ఏలూరు నగరంలో ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ గురువారం ఏఐఎస్ఎఫ్ నాయకులు, సోషల్ వెల్ఫేర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను విద్యార్థి సంఘ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రభ ప్రతినిధులతో కలిసి ఎస్సీ సంక్షేమ శాఖ ఉపాధికారి శ్రీనివాస్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఏలూరు (Eluru) రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ డబ్ల్యూ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగిందని ఈ వసతి గృహంలో మరుగుదొడ్లు, మురుగు డ్రైనేజీ వ్యవస్థ తో పాటు అనేక సమస్యలు ఉన్నాయని.. వీటన్నింటిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి మాట్లాడుతూ… విద్యను అభ్యసించడానికి గ్రామాల నుండి వస్తున్న ఎస్సీ విద్యార్థుల వసతి గృహం పై అధికారులు వివక్షత చూపించడం సరికాదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఏలూరులోని సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తుంటే ఆ వసతి గృహంలో సమస్యలు విళయతాండవం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం (ANR stadium) వద్ద ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహాన్ని అధికారులతో కలిసి వసతి గృహంలో ఉన్న సౌకర్యాలపై ఆరా తీసి అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం స్వయంగా డ్రైనేజీలో దిగి మరుగును పరిశుభ్ర పరచడమే కాకుండా డ్రైనేజీలో ఉన్న మద్యం బాటిల్లను మీడియాకు చూపించారు.
ఈ సందర్భంగా వసతి గృహంలో ఉంటున్న అనేక మంది విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వసతి గృహంలో భోజన సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని విద్యార్థులు పేర్కొన్నారు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల హాస్టల్లోకి ప్రతినిత్యం స్థానికేతరులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా మరుగునీరు పారుదల లేక విద్యార్థులు అనారోగ్యం భారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదే విధంగా రాత్రి సమయంలో వసతి గృహంలోకి ఇతరులు ప్రవేశించి మద్యం సేవించి వసతి గృహ ఆవరణలోనే మద్యం బాటిల్లను పారవేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల వసతి గృహ విద్యార్థులు తప్పుడు మార్గంలో పయనించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ హాస్టల్ వార్డెన్ కి తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రశ్నించే వారి పై అసభ్య పదజాలంతో దూషించడం అతని పని తీరుకు అద్దం పడుతుందని విమర్శించారు. జిల్లా అధికారులు స్పందించి ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహ సమస్యలు 48 గంటల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని లేనిపక్షంలో విద్యార్థులతో (Students) జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, సోషల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

