Team India | టీమిండియా జోరు..

Team India | టీమిండియా జోరు..
నేడే దక్షిణాఫ్రికాతో రెండో వన్డే
గెలిస్తే సిరీస్ వశం..
అందరి కళ్లు రోహిత్, కోహ్లీపైనే..
Team India | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం(International Stadium)లో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్‌కు రెడీ అవుతుంది. తొలి మ్యాచ్‌లో విజయంతో జోరుమీదున్న టీమ్ఇండియా(Team India) రెండో వన్డేలోనూ అదే ఫామ్ కనబర్చాలని భావిస్తోంది. సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారంగా, వన్డే సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకోవాలని భారత్ ఆశిస్తోంది.
Team India | రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే కళ్లు..

తొలి మ్యాచ్‌లో అంచనాలు అందుకొని రాణించిన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Rohit Sharma, Virat Kohli)నే ఈ వన్డేలోనూ టీమ్ఇండియాకు కీలకం కానున్నారు. అదే జోరును కొనసాగించితే అభిమానులకు పండగే.
మరోసారి రో-కో సెన్సేషన్ చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఈసారైనా రాణించాల్సి ఉంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ కూడా బలంగానే ఉంది. టాపార్డర్‌లో రో-కో రాణిస్తే జట్టుకు భారీ స్కోర్ ఖాయం.
Team India | భారీగా పరుగులిచ్చారు..
రాంచీ వన్డేలో 349 స్కోర్(Score 349) చేసినా, భారత్ అతి కష్టంమీద నెగ్గింది. భారీ ఛేదనలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయినా, టార్గెట్‌కు దగ్గరగా వచ్చిందంటే మన బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాయ్‌పుర్ పిచ్ స్పిన్నర్లతోపాటు పేసర్లకు కూడా అనుకూలమే. హర్షిత్ రాణా, అర్షదీప్, కుల్దీప్ వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు.
తొలి మ్యాచ్‌లో నుంచి పాఠాలు నేర్చుకొని, అవి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత బౌలర్లదే. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్(Allrounder) విఫలమయ్యాడు. అందుకే ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు విశ్రాంతి ఇచ్చి నితీశ్ కుమార్ లేదా రిషబ్ పంత్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
Team India | ఓడినా పోరాడారు..

ప్రత్యర్థి సౌతాఫ్రికా రాంచీ మ్యాచ్‌లో ఓఢినా, వాళ్లు పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆఖరు బ్యాటర్ దాకా పోరాడారు. ఆ రోజు టార్గెట్ 30 పరుగులు(Target 30 runs) తక్కువ ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. ఇక తొలి వన్డేలో ఓటమితో సౌతాఫ్రికా, రెండో మ్యాచ్‌కు మరింత సన్నద్ధంగా తిరిగి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బార్ట్‌మాన్, సుబ్రయన్, బర్గర్ బౌలింగ్‌లో కీలకం కానుండగా, మార్క్రమ్, డికాక్, రికెల్టన్, టోనీ జార్జిలతో సౌతాఫ్రికా బలంగా కనిపిస్తుంది. ఇక ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ ఆ జట్టుకు అతిపెద్ద బలంగా ఉన్నాడు. అతడిని ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద సవాల్ కానుంది.
