వెలగపూడి – ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగాన్నికొనసాగిస్తున్నారు.గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోడియంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గందరగోళం, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. సభలో వైసిపి నిరసనలను ఎవరు ఖాతరు చేయకపోవడంలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి జగన్ తో సహా వైసిపి ఎమ్మెల్యేలందరూ బయటకు వెళ్లిపోయారు..
ప్రతిపక్ష హోదాకు డిమాండ్
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అన్నారు. 9 నెలలు అయింది.. సూపర్ సిక్స్ ఎక్కడ ? అంటూ నిలదీశారు బొత్స సత్యనారాయణ. ప్రజల్ని మోసం చేయడం ధర్మం కాదని ఆగ్రహించారు. అసెంబ్లీ కి రావాల వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉందని వివరించారు బొత్స