Medical Negligence | వైద్యుల నిర్లక్ష్యం..?

Medical Negligence | వైద్యుల నిర్లక్ష్యం..?..
- ఏరియా ఆసుపత్రిలో ఘటన..
- న్యాయం చేయాలంటున్న బాధితుడు..
Medical Negligence, మణుగూరు, ఆంధ్రప్రభ : వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసికందు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని, మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పట్టణ వ్యాప్తంగా సంచలనం రేగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన తోలేం అరుణ నిండు గర్భిణీ స్త్రీ. పురిటి నొప్పులతో ఈ నెల 28న మణుగూరు ఏరియా ఆసుపత్రిలో చేరింది. శనివారం రోజు తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు.
వైద్యులు వెంటనే గర్భిణీ స్త్రీ అరుణకు నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. గర్భంలో శిశువు 3.6 కేజీలు ఉండడంతో డెలివరీ ఇబ్బందికరంగా మారింది. డెలివరీ పూర్తయ్యాక పండంటి బాబుకు జన్మనిచ్చినా ఆ బాబు చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన వైద్యులు వెంటనే 108 లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. భద్రాచలంలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందిందని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బాబు చనిపోయాడని వైద్యుల పై చర్యలు తీసుకోవాలని బాధితుడు తోలం శంకర్ డిమాండ్ చేస్తున్నారు.

