TG Govt | రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న బియ్యం!
TG Govt, హైదరాబాద్, ఆంధ్రప్రభ : పౌరసరఫరాలశాఖ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో (Ration Shop) కోట్లాది రూపాయల విలువైన దొడ్డు బియ్యం ముక్కిపోతున్నా యి. ఇప్పటికే దాదాపు 60 శాతం మేర దొడ్డు బియ్యం పురుగులు పట్టి పాడైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అంతకు ముందు దొడ్డు బియ్యాన్ని అందజేసింది. దీంతో రాష్ట్రంలోని రేషన్షాపుల్లో దొడ్డు బియ్యం అలానే నిల్వ ఉండిపోయాయి. ఇప్పటికే దొడ్డు బియ్యాన్ని రేషన్ షాపుల నుంచి తరలించాల్సి ఉన్నా నెలలు గడుస్తున్నా పౌరసరఫరాలశాఖ తరలించడం లేదు. ఫలితంగా రేషన్ దుకాణాల్లోనే దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఎలుకలు, తిని పురుగులు పట్టి పరూర్తిగా పనికిరాకుండా పోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17, 200కు పైగా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం గత మార్చి నెల వరకు దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసింది. అయితే కొంత మంది రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లకపోవడంతో స్టాక్ దుకాణాల్లోనే ఉండిపోయింది.
వాస్తవానికి మిగిలిన ఈ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోపే రేషన్ షాపుల నుంచి తరలించాలి. అయితే ప్రభుత్వం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుండడంతో మార్చిలో మిగిలిన దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో నిల్వ ఉండిపోయింది. స్టాక్ వివరాలను డీలర్లు పౌరసరఫరాలశాఖకు అందజేశారు. పౌరసరఫరాలశాఖ ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకెళ్లాల్సి ఉన్నా ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకు తరలించకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిపోయిన బియ్యం తాలూకు s “మిషన్ ను కూడా 8 నెలలుగా పౌరసరఫరాలశాఖ రేషన్ డీలర్లకు చెల్లించడం లేదు.
దొడ్డు బియ్యాన్ని తరలించాలని రేషన్ డీలర్లు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకుండాపోతోంది. ఒక్కో రేషన్ దుకాణంలో సుమారు 20 నుంచి 30 క్వింటాళ్లకు పైగా దొడ్డు బియ్యం ఉన్నట్టు సమాచారం. వీటి మొత్తం విలువ రూ.350 కోట్ల దాకా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించకపోంవడం పై రేషన్ డీలర్ల సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు, ఎలుకలు సన్న బియ్యం పై కూడా పడుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఫలితంగా సన్న బియ్యాన్ని తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి..
https://epaper.prabhanews.com

