COTTON | దగా పడుతున్న పత్తి రైతు

ఒకవైపు ప్రకృతి కన్నెర్ర
.మరోవైపు ధరలలేమి
ఇంకోవైపు తూకాల్లో మోసం.
కర్నూలు జిల్లా పత్తి రైతుల ఆవేదనపై ప్రత్యేక కథనం
COTTON |కర్నూలు బ్యూరో ,ఆంధ్రప్రభ : వానలు లేక పంట పండక ఇబ్బందులు.
వానలు ఎక్కువయితే పంట పూర్తిగా నేలమట్టం.
ఇటు మార్కెట్‌లో ధరలు ఎప్పటికప్పుడు మార్పులు.
అన్నింటినీ ఓర్చుకుని పత్తిని కోసి మార్కెట్ యార్డుకి తీసుకొచ్చాక…
తూకాల్లో మోసం అనే కొత్త వ్యాధి రైతును మరలా దెబ్బతీస్తోంది.
ప్రకృతికి ఎదురీదుతూ పత్తి పండించిన కర్నూలు జిల్లా రైతు ఇప్పుడు కమిషన్ ఏజెంట్ల తూకపు యంత్రాల ముందు ఓడిపోతున్నాడన్న భావన గ్రామాలన్నింట్లో వినిపిస్తోంది. పొలం లోకో, మార్కెట్‌లోకో—తేడా లేకుండా ప్రతి అడుగులోనా లాభం దూరమవుతుండటమే రైతులో ఆంతర్యామినిగా నిలుస్తోంది. తూకాల్లో మోసం… వ్యవస్థకు మునుపటి నుండి ఉన్న పాడుపొర

నిజం బయటపెట్టిన ఆకస్మిక తనిఖీలు
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ శాఖ ఈ నెల 18 నుంచి 22 వరకు జిల్లాలోని పత్తి మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు జరపడం..రైతుల్లో ఓ ఆశవెలుగు నింపింది.గూడూరు, కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, ఆదోని, కోసిగి వంటి పత్తి బెల్ట్ గా పేరుగాంచిన మండలాల్లో జరిగాయి ఈ తనిఖీలు. వేజ్ బ్రిడ్జ్‌లు, గిన్నింగ్ ప్రెస్ యూనిట్లు, కమిషన్ ఏజెంట్ల వద్ద ఉన్న యంత్రాలను విపులంగా పరిశీలించిన అధికారులు 12 కేసులు నమోదు చేసి రూ.90 వేలు జరిమానా విధించారు.

తనిఖీల్లో ప్రధానంగా కనిపించిన లోపాలు
గడువు ముగిసిన తూకపు యంత్రాలు, రీ-వెరిఫికేషన్,స్టాంపింగ్ లేకుండానే వాడుతున్న ఎలక్ట్రానిక్ బరువుమీటర్లు,రైతు గమనించలేని చిన్న వేరియేషన్ల పేరుతో తూకం తగ్గించడం,వేజ్ బ్రిడ్జ్ లెవెల్ సర్దుబాట్లు, యూనిట్‌కు సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ ప్రదర్శించకపోవడం
ఈ చిన్న చిన్న లోపాలే రైతుకు క్వింటాల్‌కు 10–15 కిలోల నష్టం కలిగిస్తున్నాయి. వారానికి వందల క్వింటాళ్లు మార్కెట్‌లోకి వస్తున్న సందర్భంలో,ఈ మోసాలు లక్షల్లో దాగిపోతున్నాయన్నది వాస్తవం.
ఒక్కో లోడ్‌లో 300–400 రూపాయలు నష్టపోతున్నాం.. రైతుల ఆవేదన
కొద్దికాలంగా పత్తి తెగుళ్లతో, ఎండ కారణంగా దిగుబడి తగ్గడంతో రైతులు ఇప్పటికే నష్టపోతున్నారు. పైగా, కొనుగోలు కేంద్రాల్లో తూకా మోసం జరిగితే రైతు సంపూర్ణంగా దెబ్బతింటున్నాడు.
మూడున్నర నెలలు శ్రమించి, పెట్టుబడి పెట్టి, ట్రాక్టర్‌లో లోడ్ చేసుకుని యార్డుకి వస్తాం. అక్కడ తూకంపైనే మా లాభనష్టాలు. కానీ యంత్రాలు రైతు కష్టాన్ని గుర్తించట్లేదు’ అని కోడుమూరు మండలానికి చెందిన రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ హెచ్చరిక—వ్యవస్థను మార్చే ప్రయత్నమా?
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టంగా హెచ్చరించారు: తూకాల్లో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించినట్లుగానే కలెక్టర్ ఆదేశాలు అన్ని యంత్రాలకు లీగల్ మెట్రాలజీ స్టాంపింగ్ తప్పనిసరి, వ్యాపారులు వెరిఫికేషన్ సర్టిఫికెట్ వ్యాపార స్థలంలో స్పష్టంగా ప్రదర్శించాలి.
వినియోగదారులు కూడా ముద్ర, సర్టిఫికెట్ ఉన్నాయో లేదో చూసుకోవాలనీ కలెక్టర్ మాటల్లో వెల్లడించారు.
“రైతు నష్టపోకుండా ఉండేందుకు లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా నిరంతర తనిఖీలు కొనసాగిస్తాం

ఇది రైతుకు రక్షణకవచంలా మారే అవకాశముంది.
రైతు దగా పడుతున్న త్రివిధ దేబ్బ
రైతు ఒకే సీజన్‌లో మూడు తరహాల దెబ్బలు పడుతున్నాడు:
1) ప్రకృతి కన్నెర్ర
వర్షాల అస్థిరత, తెగుళ్లు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు.
2) ధరలలేమి
ప్రతి రోజూ మారుతున్న మార్కెట్ రేట్లు—పంట దిగుబడి తగ్గినా ధరలు పంటను ఆదుకునే స్థాయిలో ఉండడం లేదు.
3) తూకాల్లో మోసం
వ్యవస్థలోని లోపాలు, కమిషన్ ఏజెంట్ల అవకతవకలు రైతు చివరి ఆశను కూడా కూల్చేస్తున్నాయి. రైతు శ్రమకు తూకం ఉండాలంటే వ్యవస్థలో పారదర్శకత తప్పనిసరి
తూకాలో మోసం ఒక చిన్న తప్పు కాదు..పొలంలో పెరిగిన ప్రతి గింజకు విలువ ఇచ్చే రైతు శ్రమను అవమానపరచడం.వ్యవస్థ పారదర్శకంగా మారకపోతే మార్కెట్‌పై రైతు నమ్మకం క్షీణిస్తుంది.కాబట్టి,నిరంతర తనిఖీలు,డిజిటల్ బరువు పరికరాల ప్రమాణీకరణ,రైతులకు అవగాహనపారదర్శక కొనుగోలు విధానంఅవసరం. పత్తి రైతు చెమటకు చెల్లింపు రావాలంటే ‘నిజమైన తూకం’ అవసరం.
ప్రకృతిని ఓడించి పత్తి పండించిన రైతు—తూకం ముందు ఓడిపోరాదు.ప్రభుత్వం చేసిన తాజా తనిఖీలు రైతుల్లో నమ్మకం పెంచినా,ఈ మోసాలపై శాశ్వత పరిష్కారం దొరికితేనే..రైతు చెమటకు నిజమైన విలువ దక్కుతుందనేది స్పష్టమైన సందేశంలో కలెక్టర్ వెల్లడించారు.
