NZB | ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి …
బిక్కనూరు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు అధిక సీట్లు కేటాయించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పున్న రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో ముదిరాజుల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, జనాభా ప్రాతిపాదికగా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజుల రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జెలు బిక్షపతి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో మత్స్యకార సహకార సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి, వాటిలో ముదిరాజులకు సభ్యత్వాలు కల్పించాలని కోరారు. ముదిరాజులను BC–D నుంచి BC–A కు మార్చి, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం, అందులో ముదిరాజులకు ప్రత్యేక స్థానం ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా బీసీలకు “మేమెంతో – మాకు అంతే” అనే విధంగా రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కోరారు. జంగంపల్లి ముదిరాజ్ అధ్యక్షులు సిద్దయ్య, రమేష్తో పాటు పెద్ద సంఖ్యలో ముదిరాజులు పాల్గొన్నారు.

