AP | అతడి కథ ఒక స్ఫూర్తిదాయక జీవిత పాఠం – చంద్రబాబు షేర్ చేసిన పోస్ట్
శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వలసవెళ్లిన వ్యక్తి
వెదురుబుట్టలు, విసనకర్రలు తయారీతో జీవనం
కల, కళను కలగలిపి వస్తువులుగా మలుస్తున్నారు
నైపుణ్యం ఉన్నవారికి తోడ్పాటునిస్తాం
హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ పోస్టును షేర్ చేసిన సీఎం చంద్రబాబు
విజయవాడ, ఆంధ్రప్రభ : ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టును షేర్ చేశారు. ఓ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నో ఏళ్ల కిందట హైదరాబాద్ వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవిస్తున్న వైనాన్ని హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది. ఈ పోస్టును ఏపీ సీఎం చంద్రబాబు షేర్ చేశారు. ఇది ఒక స్ఫూర్తిదాయక జీవితపాఠం అని కొనియాడారు.
నైపుణ్యం ఉన్నవారికి తోడ్పాటునిస్తాం..
అతడి కథను పరిశీలిస్తే కష్టించి పనిచేసే స్వభావం, ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కానీ, అతడు సొంతగడ్డను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లడం తనను విచారానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావహ దృక్పథం బాగా నచ్చాయని, తన కలలను, కళను కలగలిపి వస్తువులుగా మలిచి జీవనం సాగిస్తుండడాన్ని ప్రగాఢంగా అభిమానిస్తున్నానని వివరించారు. “ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్ నిర్మించడానికి, అవకాశాలను సృష్టించడానికి కృషి చేస్తోంది. ఆ వ్యక్తిలా నైపుణ్యం ఉన్న వారు స్వస్థలంలోనే ఉంటే ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తాం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.