Thailand Masters | కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం..

  • శంకర్‌, రోహన్‌-రుత్విక జోడీ కూడా ముందంజ

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌తో పాటు శంకర్‌ సుబ్రమన్యణ్‌ కూడా ముందంజ వేశాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో రుబెన్‌ కుమార్‌-హరీహరణ్‌… మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌-రుత్విక శివాణి జోడీలు కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించాయి.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మాజీ వరల్డ్‌ నెం.1, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ 21-13, 21-18 తేడాతో ఇజ్రాయిల్‌కు చెందిన డానిల్‌ డుబవెంకోను వరుస గేముల్లో చిత్తు చేసి ప్రి-క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.

మరో మ్యాచ్‌లో శంకర్‌ ముత్తుసామి సుబ్రమన్యణ్‌ 15-21, 21-15, 21-19 తేడాతో చీమ్‌ జున్‌ వీ (మలేషియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మరోవైపు మిథున్‌ మంజునాథ్‌ 14-21, 13-21తో మలేషియాకు చెందిన ఆదిల్‌ చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇక‌ మహిళల సింగిల్స్‌లో రక్షితన శ్రీ సంతోష్‌ రామ్‌రాజ్‌ 21-19, 21-16 తేడాతో వు లువ్‌ యు (చేనా)ను వరుస గేముల్లో ఓడించింది.

పురుషుల డబుల్స్‌లో రుబేన్‌ కుమార్‌-హరీహరణ్‌ జోడీ 21-18, 21-12 తేడాతో స్థానిక పన్నవట్‌-రాచపొల్‌ (థాయ్‌లాండ్‌) జంటపై అలవోకగా విజయం సాధించి టోర్నీలో ముందంజ వేసింది. మిక్స్‌డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌-రుత్విక శివాణి జోడీ 21-8, 21-16తో ఫక్‌జరుంగ్‌-సరత్‌ చుబెకా (థాయ్‌లాండ్‌) జంటను చిత్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *