Jagan | కోర్టుకు వచ్చారు.. వెళ్లారు!

Jagan | కోర్టుకు వచ్చారు.. వెళ్లారు!
Jagan | హైదరాబాద్, ఆంధ్రప్రభ : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఇవాళ సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)కు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లి (Nampally) లోని కోర్టుకు చేరుకున్నారు. కోర్టులో ముప్పయి నిమిషాల తర్వాత అక్కడ నుంచి బంజరాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌కు బయలుదేరి వెళ్లారు.
ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ (Jagan) మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ (Jagan) కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ (CBI) స్పష్టం చేసింది. ఈ క్రమంలో రేపటి లోపు వ్యక్తిగతంగా హాజరవ్వాలని జగన్‌ను కోర్టు ఆదేశించడంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు. జగన్ వస్తున్న సంగతి తెలుసుకున్న వైఎస్ అభిమానులు అధిక సంఖ్యలో సీబీఐ కోర్టు దగ్గరకు చేరుకున్నారు.
