Crime | భర్త చేతిలో భార్య దారుణ హత్య..
విజయవాడ, క్రైమ్ ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న పాశవిక హత్య కేసా నగరాన్ని కలిచివేసింది. దంపతుల మధ్య వివాదం దారుణమైన హత్యకు దారితీసింది.
నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30), అవనిగడ్డకు చెందిన దీపాల విజయ్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట సుఖంగా జీవించిన వీరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ విడిగా జీవించడం ప్రారంభించారు.
విజయ్ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ల్యాబ్‌లో పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నాడు. మరోవైపు సరస్వతి విన్స్ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తూ ప్రతిరోజూ నూజివీడునుంచి విజయవాడకు ప్రయాణం చేస్తోంది.
గురువారం సాయంత్రం సరస్వతి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, భర్త విజయ్ ముందుగానే పథకం వేసుకుని ఆమెపై దాడి చేశాడు. వెంట తీసుకువచ్చిన కత్తితో పీక కోసి ఆమెను హత్య చేశాడు.
రక్తసిక్తమై కుప్పకూలిన సరస్వతిని కాపాడడానికి ప్రయత్నించిన స్థానికులను కూడా విజయ్ దగ్గరికి వస్తే చంపేస్తా అంటూ బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు విజయ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

