Srisailam |శ్రీశైలంలో కేటుగాళ్లు..!

  • … కార్తీక మహోత్సవ వేళ కాంటాక్ట్ ఉద్యోగుల చేతివాటం
  • … స్పర్శ దర్శనం పేరుతో మోసాలు
  • … ఆన్‌లైన్ ఉన్నప్పటికీ మామూలు టికెట్లు ఇస్తున్న వైనం
  • … కెపాసిటీకి మించి టికెట్లు ఇస్తున్న వైనం భక్తుల ఆగ్రహం

Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం((Srisailam))లోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని తిరుపతి తరహాలో మరొక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అయితే అక్కడ కొంతమంది వ్యక్తుల కారణంగా ఆల‌య పవిత్రత మంట కలుస్తుందని భక్తుల ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీశైలంలో మద్యం, మాంసం కూడా దొరికిన సందర్భాలు ఉండటం భక్తులు మరింత రగిలిపోతున్నారు.

కార్తీకమాసం ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో దోపిడీ జరుగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. స్పర్శ దర్శనం టికెట్ల కంపెనీలో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. శ్రీశైలంలో స్పర్శ దర్శనానికి భక్తులకు ఆన్‌లైన్‌లో 1500 మందికి టికెట్స్ ఇవ్వాల్సి ఉండగా, అదనంగా సుమారు 4వేల మందికి ఇవ్వటం పలు విమర్శలకు దారితీసింది. ఎక్కువమందికి టికెట్స్ ఇచ్చి భక్తులకు ఇబ్బందులు కల్పించారని భక్తులు ఆరోపిస్తున్నారు. కొద్దీ మంది చోటా నాయకుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది అనేది అక్కడి ప్రత్యక్షుల కథ‌నంగా చెప్పుకోవటం విశేషం. భక్తుల నుంచి ఆన్‌లైన్‌లో ఐదు వందల రూపాయలు తీసుకుంటారు. కొందరు వ్యక్తులకు మూడు వందల రూపాయల టికెట్స్ కొనిచ్చి ఆ క్యూలైన్‌లో పంపిస్తారు. ఆ భక్తులతో వెళ్లి దగ్గరికెళ్లిన తరువాత స్పర్శ దర్శనానికి పంపి ఒక్కో భక్తుని నుండి తిరిగి అదనంగా 200 రూపాయలు తీసుకోవటం పలు విమర్శలకు దారితీస్తుంది.

అక్కడ ఒక్కొక్కరు అనధికారికంగా ఉన్న వ్యక్తులు రోజుకు కొన్ని వేల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విష‌యంలో భక్తులు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 500 రూపాయలు స్పర్శ దర్శనం కోసం పది మంది భక్తులు వెళ్తే.. అందులో ఆరుగురికి టికెట్స్ కు డబ్బులు చెల్లించి… మిగతా వారినుండి డబ్బులు వసూలు చేసుకొని అక్కడ తెలిసిన వారితో కుమ్మక్కై దర్శనానికి పంపుతున్నారన్న వాస్తవాలను ఉన్నతాధికారులు గుర్తించటం లేదని భక్తులు పేర్కొంటున్నారు.

కార్తీక మాసం సందర్భంగా భక్తులను తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా భక్తుల మనోభావాలు దెబ్బ‌తిన‌కుండా చూడాలని పాలకమండలికి, నేతలకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలో అన్యమతస్తులు కూడా సంచరిస్తున్నారని వారందరినీ కట్టడి చేయాలని భక్తులు కోరుతున్నారు.

Leave a Reply