అల్లుడి కిరాతకం

గొల్లల కోడేరులో  భార్య సహా ముగ్గురికి కత్తిపోట్లు

( భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో)

అత్తింటి వారిపై అల్లుడు కత్తితో కిరాతకంగా దాడిలో భార్య, పిల్లనిచ్చిన మామయ్య, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. బావమరిది చేతి వేళ్లు కూడా తెగిపడ్డాయి. ఈ సంఘటన సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు పంచాయతీ పరిధిలోని తుమ్మలగుంటపాలెం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణకు కుమారుడు రాజేష్ బాబు , కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. కుమార్తెను అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని  వీరవల్లి రామచంద్రరావు అనే చందు కి ఇచ్చి 17 సంవత్సరాల క్రితం వివాహం చేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామచంద్రరావు గత 17 సంవత్సరాల నుండి ఎక్కువగా గల్ఫ్ దేశమైన ఖత్తర్ లో ఉంటూ  వచ్చినప్పుడల్లా భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. గతంలో రెండు సార్లు పెద్దలలో పెట్టగా పరిష్కరించారు. పాలకోడేరు, అత్తిలి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి  కాపురానికి పంపించారు. రామచంద్రరావులో మార్పు రాకపోగా భార్యను చంపేస్తానని భయభ్రాంతులకు గురి చేసేవాడు. దీంతో ప్రాణభయంతో శ్రీలక్ష్మి తుమ్మలగుంటపాలెంలో తన పుట్టింట్లో సుమారు నెలరోజులుగా ఉంటుంది.

—– —-

రూ.4 లక్షలు కోసం వచ్చి..

—– —-

శ్రీలక్ష్మి బంగారం తాకట్టు పెట్టి రూ.4 లక్షలు ఇటీవల తీసుకుంది.  ఈ డబ్బులు ఇవ్వమని శ్రీలక్ష్మిని ఆదివారం ఉదయం అడిగాడు. డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో వీరవల్లి రామచంద్ర రావు తన మేనమామ అయిన మట్టపర్తి కృష్ణ తో  వచ్చాడు.  ఇంటి ముందు ఉన్న సిమెంట్ రోడ్డుపై వాకింగ్ చేస్తున్న తన భార్య శ్రీలక్ష్మిని కత్తితో  దాడి చేశాడు. ఈ సమయంలో అడ్డువచ్చిన మామయ్య కడలి సత్యనారాయణను పొట్టలో రెండుసార్లు పొడిచాడు.  ఇంటిలో ఉన్న కడలి రాజేష్ బాబు తన బావ రామచంద్రరావుని అడ్డుకునే ప్రయత్నంలో రామచంద్రరావు తనతో తెచ్చుకున్న కత్తితో బావమరిది రాజేష్ బాబు చేతి మణికట్టు పైన నరకగా నాలుగు వేళ్ళు తెగి కిందపడ్డాయి. ఈ సంఘటన తీవ్రంగా గాయపడిన వీరిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  రాజేష్ బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో అతనికి మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ తరలించారు. ఈ సంఘటనపై కడలి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు పై పాలకోడేరు ఎస్సై మంతెన రవి వర్మ కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని భీమవరం డీఎస్పీ జయ సూర్యభీమవరం రూరల్ సీఐ  బి.శ్రీనివాస్, ఎస్సైలు పరిశీలించారు.

Leave a Reply