ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి

ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క


కర్నూలు బ్యూరో, నవంబర్, ఆంధ్రప్రభ : ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క (Vimalakka) డిమాండ్ చేశారు. స్థానిక ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి ) కార్యాలయంలో జరిగిన నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పాటల సీడీ ఆవిష్కరణలో ఆమె పాల్గొని మాట్లాడారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క చేత సీడీ ఆవిష్కరణ జరుగగా, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్య‌క్షుడు కరీం భాష (Karim Bhasha) అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… విమలక్క, భూమికోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం బలిదానం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నవంబర్ నెలను అమరుల స్మృతి నెలగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వంటి విప్లవమూర్తుల త్యాగాలు 50 ఏళ్లు దాటినా నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ పేరిట ఆదివాసులపై, మావోయిస్టులపై యుద్ధం చేస్తున్నట్టుగా విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేసి శాంతి చర్చలు (Peace talks) చేపట్టాలని విమలక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో రైతు-కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకన్న, స్త్రీ విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుజ్ఞానమ్మ, అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షుడు ఖదీర్ అయ్యా, మల్సూర్, రాకేష్ అరుంధతి సౌజన్య పాల్గొన్నారు.

Leave a Reply