యువత పాత్రే కీలకం
అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
నంద్యాల కలెక్టర్ కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల బ్యూరో, నవంబరు, ఆంధ్రప్రభ : అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి (G. Rajakumari) అన్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువతలోని ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణావకాశమని, యువత తాము నైపుణ్యం కలిగిన రంగాల్లో ప్రతిభను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉన్న శ్రీ రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, సెట్కూరు సీఈఓ డా. కె. వేణుగోపాల్, కళాశాల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ ప్రగతి రెడ్డి, టీడీపీ నాయకుడు ఎన్.ఎం.డి. ఫిరోజ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి (Parliament Member Byreddy Sabari) లు మాట్లాడురు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని యువతలోని సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ లక్షణాలను వెలికితీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యువజనోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నారు. వ్యాసరచన, పెయింటింగ్, నృత్యం, గానం, జానపద కళలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. యువతకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమని అన్నారు. విద్యార్థి దశలో ఎదురయ్యే గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో విజయపథంలో ముందుకు సాగవచ్చన్నారు. జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచే ఉన్నందున, విద్యార్థులు తమ నైపుణ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా మలచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని చెప్పారు.

ఉపాధ్యాయులు (Teachers) విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ, వారిలో నేర్చుకునే తపనను పెంపొందించాలన్నారు. దేశ అభివృద్ధిలో యువత ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. యువత సాంప్రదాయ విలువలను కాపాడుకుంటూ ఆధునికతను అంగీకరించాలన్నారు. మహిళా క్రికెట్ జట్టు ఇటీవల వరల్డ్ కప్ గెలిచి దేశ గౌరవాన్ని నిలబెట్టిందని, యువత వారిని ఆదర్శంగా తీసుకొని తమ తమ రంగాల్లో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

