ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : పట్టణాల్లోనే కాదు.. ఏజెన్సీ గిరి పల్లెల్లోనూ తెలంగాణ తొలి సీఎం, ఉద్యమ జాతిపిత కేసీఆర్ బర్త్‌డే వేడుకలు సంబరంగా జరిగాయి. తమ ఉద్యమ నేత కేసీఆర్ మరోసారి సీఎం కావాలని, నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ.. ప్రతిచోట వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అన్నదాన కార్యక్రమం, గంగపుత్ర శివాలయంలో అభిషేకాలు, ప్రసిద్ధ జైనథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ అభిమాన నేతకు బర్త్‌డే విషెస్ చెప్పారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో వృక్షార్చన పేరిట పలుచోట్ల మొక్కలు నాటి ప్రత్యేక పూజలు పాలుపంచుకున్నారు.
నేరడిగొండలో 700 మంది రక్తదానం..
కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోత్ అసెంబ్లీ నియోజకవర్గం నేరడిగొండ ఏజెన్సీ కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో 700 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి కేసీఆర్ పట్ల ఉన్న విధేయత, అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా కార్యకర్తలతో కలిసి రక్తదానం చేసి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటి రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలంతా ఏవగించుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ ఇకపై ప్రజల అభిమానంతో సత్తా చాటుకొని అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
ఆసిఫాబాద్ నియోజవర్గంలో…!

ఆసిఫాబాద్ ఏజెన్సీ కేంద్రాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకాయి. ఏజెన్సీ మండల కేంద్రాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటి శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉద్యమంలా మొక్కలు నాటి జన్మదిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖర గ్రామంలోనీ పంట చేనులలో కేసీఆర్ ఫ్లెక్సీలు తగిలించి సారే రావాలి.. మళ్లీ సారే సీఎం కావాలి.. నినాదాలతో ఫ్లెక్సీలు తగిలించి రైతులు బర్త్ డే వేడుకల్లో అభిమానాన్ని చాటుకున్నారు. లాంగ్ లివ్ కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్ నినాదాలు ఊరు వాడల్లో మార్మోగాయి.