హైడ్రా బాధితులతో కేటీఆర్, హరీశ్ రావు దీపావళి వేడుకలు

హైడ్రా బాధితులతో కేటీఆర్, హరీశ్ రావు దీపావళి వేడుకలు

  • ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇండ్లు కూల్చే రాజ్యం..
  • మూసీ పేరుతో పేదల జీవితాలను మ‌సి చేశారు.
  • రెండేళ్లలో కాంగ్రెస్‌ను దించి అప్పుడు దీపావళిగా చేసుకుందాం…

హైదరాబాద్ : మూసీ ప్రాజెక్ట్ పనుల పేరుతో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాల బాధిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ (BRS) అగ్రనేతలు దీపావళి పండుగను జరుపుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘మా ప్రభుత్వం వస్తే ఇండ్లు కట్టిస్తాం’ కేటీఆర్

సున్నం చెరువు పరిధిలో హైడ్రా కూల్చివేతలకు గురైన బాధితులతో కలిసి కేటీఆర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారికి భరోసా ఇస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నరకాసురుడి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండేళ్లలో గద్దె దించి అసలైన దీపావళి చేసుకుందాము. మీకు మా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సున్నం చెరువు పరిధిలో హైడ్రా కూల్చిన బాధితులందరికీ మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇండ్లు కట్టించి ఇస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. మీకు ఇక్కడే ఇండ్లు కట్టించి గౌరవంగా మిమ్మల్ని మీ ఇళ్లల్లోకి పంపిస్తాము.”

కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు అవుతున్నా ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, పేదలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. “ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లను కూలగొట్టి, ప్రజల బతుకులను రోడ్ల మీదకు తేవడమే రేవంత్ బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం!” అని మండిపడ్డారు.

‘పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా?’ హరీశ్ రావు

ఇక‌ రాజేంద్రనగర్ నియోజకవర్గం, హైదర్ షా కోట్‌లోని మూసీ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇంఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి దీపావళి పండుగ జరుపుకున్నారు. హరీశ్ రావు తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే… ఇవాళ మనకి నయా నరకాసురుడు వచ్చాడు, ఇళ్లు కూలగొడతామని బయపెడుతున్నాడు. ఈ నరకాసురుడి పీడ విరగడ అయినప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళి.”

“పేరు మూసీ.. పెద్దోళ్లకేమో ఖుషీ. పేదోళ్ళ బ్రతుకులేమో మసి.. ఇదే రేవంత్ రెడ్డి కసి. మూసీ సుందరీకరణకు ఖాళీ భూమి ఉన్నా, నెల జీతాలతో బ్రతికే పేదోళ్ల ఇండ్లు కూల్చి వాళ్ల జీవితాలు మసి చేశాడు. హైడ్రా కమీషనర్ రంగనాథ్… చెరువుల్లో ఉన్న పొంగులేటి ఇల్లు, రేవంత్ రెడ్డి తమ్ముని ఇల్లు కనిపిస్తలేదా? హైడ్రాలో పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం ఉంటదా?” అని ప్రశ్నించారు.

కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ బాధితుల పిల్లలకు దీపావళి బహుమతులు పంపిణీ చేసి, వారి జీవనోపాధిని తిరిగి స్థాపించే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Leave a Reply