9 మంది నిందితుల అరెస్టు
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల నుండి కోట్లాది రూపాయలను వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన రమావత్ మధు నాయక్(Ramavat Madhu Nayak)తో పాటు అతనికి ఏజెంట్లుగా వ్యవహరించిన 8 మందిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పి శరత్ చంద్ర పవర్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.
పీఏ పల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని పలుగు తండాకు చెందిన మధు నాయక్ పదవ తరగతి చదివి సులభంగా డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతో అధిక వడ్డీ చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రజల నుండి కోట్ల రూపాయలను వసూలు చేసి అసలు, వడ్డీ కూడా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పారు. జనాలను నమ్మించేందుకు హైదరాబాదు(Hyderabad)లో గోకుల నందన్ ఇన్ ఫ్రా ఇండియా పేరుతో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించాడని చెప్పారు.
ఖరీదైన ఫార్చునర్ కారులో తిరుగుతూ తనకు వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని జనాలకు చెప్పే వాడని ఎస్పీ శరత్ చంద్ర పవార్(Sharat Chandra Pawar) చెప్పారు. జనాలలో మరింత నమ్మకం పెంచుకునేందుకు పలుగు తండాలో ఆధునాతన భవన నిర్మాణాన్ని చేపట్టాడని చెప్పారు. మొదట బాలాజీ నాయక్ వద్ద ఏజెంట్గా పని చేసిన మధు నాయక్ అతనితో వచ్చిన విభేదాలతో అతనికంటే ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి ఏజెంట్ల ద్వారా కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆయన చెప్పారు.
అరెస్టు అయిన నిందితులలో జహీరాబాద్(Zaheerabad) మగ్దుంపల్లి మండలం విట్టు నాయక్ తండాకు చెందిన భరత్ కుమార్, త్రిపురారం మండలం వస్రం తండాకు చెందిన నగారా బాలు, రంగారెడ్డి జిల్లా అల్మాస్ గూడకు చెందిన సభావత్ రమేష్, పీఏ పల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ రవీందర్, రమావత్ జవహర్లాల్, పీఏ పల్లి మండలం వద్దిపట్లకు చెందిన సట్టు నరేష్(Sattu Naresh), నల్లగొండ జిల్లా చండూరు మండలం సిరిడే పల్లి గ్రామానికి చెందిన కడారి రాంప్రసాద్, నల్లగొండ జిల్లా వాడపల్లి మండలం గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన రమావత్ గణేష్ లను అరెస్టు చేసినట్లు ఎస్పి శరత్ చంద్ర పవార్ చెప్పారు.
నిందితుల నుండి అత్యంత విలువైన 7 కార్లు, 9 సెల్ ఫోన్లు, గోబ్లర్ కంపెనీ(Gobbler Company)కి చెందిన డబ్బుల కౌంటింగ్ మిషన్, ఏజెంట్లు, వారి బంధువుల పేర్లపై ఉన్న విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజలు ఎవరూ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పే వారి మాటలకు మోసపోవద్దని సూచించారు. బాధితులు ఎవరూ అధైర్య పడొద్దని తమకు జరిగిన మోసాన్ని ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్ పి రమేష్(Additional SP Ramesh) తదితరులు పాల్గొన్నారు.
