అటు అల్పపీడనం….ఇటు మేఘాల గర్జన
ముసురులో ఉక్కిరిబిక్కిరి
అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు
అధికారులు అప్రమత్తం
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటం, ఇదే ప్రాంతంలో అల్పపీడనం విస్తరించి ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ముసురు కొమ్ముకుని ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో తీవ్ర వాయుగుండం గా బలపడే అవకాశం ఉన్న పరిస్థితులలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుండి మాస్టర్ గా ప్రారంభమైన ఈ వర్షాలతో పాటు అక్కడ పిడుగులు సైతం పడుతుండడం, చల్ల గాలుల ప్రభావంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. క్రమ క్రమంగా జిల్లా వ్యాప్తంగా మేఘాలు కమ్ముకుని ఉండడం తేలికపాటి నుండి భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా నమోదు కావడం జిల్లాలో సగటు వర్షపాతం 40 మిల్లీమీటర్లకు పైగా నమోదు అవుతుంది. ఏకధాటిగా కురుస్తున్న ఈ వర్షాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు నిండి వాగులు వంకలు, పొంగిపొర్లుతున్నాయి. జిల్లాతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీటికి తోడు మురుగునీరు సైతం రహదారులపై ఉండడంతో ఇటు వాహనదారులు, నగర ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పలు ప్రాంతాలలో పిడుగులు పడిన సమాచారం అందుతుండగా, మరికొన్ని ప్రాంతాలలో రహదారిపై ఉన్న నీటి కారణంగా బస్సులు పలు వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. వర్షాలు, వరదలపై క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో జిల్లా యంత్రాంగానికి సూచించారు. 9154970454తో కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలూ అన్ని శాఖల అధికారుల సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. డివిజన్ స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లను క్రియాశీలం చేయాలని, కృష్ణానది , బుడమేరు, మున్నేరులో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నదీ పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేస్తున్నామని, నదితో పాటు వాగులు, వంకలవైపు ప్రజలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని, దుకాణదారులకు, ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
బ్యారేజీకి నీటి పోటు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ పోటెత్తితోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి ప్రకాశం బ్యారేజీకి 53 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ప్రవాహం ఉండగా బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 3.09 టీఎంసీలు చేరుకున్న నేపథ్యంలో మిగులు జలాలను సాగునీటి అవసరాల కోసం కాలువలకు, మిగిలిన నీటిని బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 52,800 క్యూసెక్కులు ఉండగా కేఈ మెయిన్ కెనాల్ కు 4,606 క్యూసెక్కులను, కె డబ్ల్యూ మెయిన్ కెనాల్ కు 4,513 క్యూసెక్కుల నీటిని గుంటూరు ఛానల్ కు 181 క్యూసెక్కుల నీటిని మొత్తంగా కలిపి 9,300 క్యూసిక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. మిగిలిన 43,500 క్యూసిక్కుల నీటిని దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.