మక్తల్ , అక్టోబర్ 19 (ఆంధ్రప్రభ) : పాలమూరు ఉమ్మడి జిల్లా పరిధిలోని తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని కృష్ణ చెక్పోస్ట్ పై ఏసీబీ అధికారులు అర్ధరాత్రి దాటాక దాడులు నిర్వహించినట్లు తెలిసింది. చెక్పోస్ట్ నిర్వహణలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆకస్మికంగా అర్ధరాత్రి దాటాక దాడులు చేయడం కలకలం సృష్టించింది. దాడి జరిగిన సమయంలో ఏసీబీ అధికారులు ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద లైట్లను ఆర్పివేసి సెల్ఫోన్ లైట్లతో సోదాలు నిర్వహించారని తెలిసింది.
ఈ సోదాల్లో అక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నుంచి లెక్కకు మించి అదనంగా ఉన్న దాదాపు 50 వేల రూపాయలు చెక్పోస్ట్ సిబ్బంది నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు దాడి చేసిన సమయంలో వారి నుంచి సరైన సమాధానం లభించలేదని తెలిసింది. చెక్పోస్ట్ పై ఏసీబీ దాడులు జరగడంతో ఆదివారం ఉదయం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఆందోళనగా కనిపించారు. ఏసీబీ దాడుల గురించి వారి నుంచి ఎలాంటి సమాధానం లభించడం లేదు.