బీసీ, బ‌హుజ‌న సంఘాల ఆందోళ‌న‌

బీసీ, బ‌హుజ‌న సంఘాల ఆందోళ‌న‌

మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళి

కర్నూలు బ్యూరో, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బంద్‌కు మద్దతుగా కర్నూలులో బీసీ సంఘాలు, బహుజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా బిర్లా గేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నాయ‌కులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ బంద్ విజయవంతం కావాలని నినాదాలు చేస్తూ ఐక్యంగా తమ మద్దతు తెలిపారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ, దేశంలో అగ్రవర్ణాలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇకపై ఈ అన్యాయం సహించబోమని హెచ్చరిస్తూ, బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని, దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు అన్వర్ హుస్సేన్, బహుజన విద్యావంతుల నాయకులు జె.వి. కృష్ణయ్య, రామశేషయ్య, రంగస్వామి, వర్మ, నాగభూషణం, శివశంకర్, మాధస్వామి, దామోదరం రాధాకృష్ణ, అలాగే పట్నం రాజేశ్వరి, విజయలక్ష్మి, శేషఫణి, ధనుంజయ ఆచారి, బత్తుల లక్ష్మీకాంతయ్య, కురువ బలరాం, డేవిడ్, బ్యాంకు రాముడు, సింధు నాగేశ్వరరావు, విద్యార్థి ప్రతినిధి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply