రసమయి బాలకిషన్‌పై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
దిష్టిబొమ్మ దహనం.. రాస్తారోకో
మానకొండూర్ ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టి బొమ్మను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దహనం చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై రసమయి బాలకిషన్ అసభ్య పదజాలంతో దురుసుగా మాట్లాడిన వాట్సాప్ ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో శుక్రవారం మండల కేంద్రంలో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రసమయి దిష్టిబొమ్మను దహనం చేశారు. రసమయి మాట్లాడిన తీరును సభ్య సమాజం ఖండిస్తుందన్నారు. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రసమయి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.