290 కేజీలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్
కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
(ఆంధ్రప్రభ బ్యూరో ) శ్రీకాకుళం, అక్టోబర్ 16 : జిల్లాలోని ఎచ్చెర్ల మండలం (Etcherla Mandal) చిలకపాలెం వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో తరలిస్తున్నదాదాపు 290 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 40 పాకెట్లలో ఈ గంజాయి (Ganja) ని తరలిస్తున్నారు.
కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కె వి మహేశ్వరరెడ్డి గురువారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. ఒడిశాకు చెందిన కోరపుట్ జిల్లా లంపటాపట్ గ్రామానికి చెందిన సమర మటం అలియాస్ డుంబురు అలియాస్ గోపాల్ అనే వ్యక్తి ఈ గంజాయిని ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లాలో ఉంటున్న అతని యజమాని గౌరవ్ చెప్పినట్లుగా మీరట్‌కు తరలిస్తున్నాడని తెలిపారు. ఒడిశా (Odisha) నుంచి సుంకిలి, పొత్తంగి మీదుగా సాలూరు, రామభద్రపురం, రాజాం మీదుగా జాతీయ రహదారికి వస్తుండగా కారును పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఎచ్చెర్ల పోలీసులని ఎస్పీ ప్రశంసించారు.


