బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు..
- ప్రభుత్వంనుంచి పైసా రాలేదు
- నిర్వహణ భారం భరించలేం
- తేల్చి చెప్పిన ప్రైవేటు ఆసుపత్రులు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వాడుకునేందుకు వీల్లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల సంఘం బంద్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో గతంలో ‘ఆరోగ్యశ్రీ’గా ఉన్న పథకం, కూటమి సర్కారులో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’గా మారింది. అయితే ఈ పథకం కింద బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటివరకూ బకాయిలు రూ.2,700 కోట్లు దాటిపోయాయని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, అక్టోబర్ 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపేస్తున్నామని ఆశా ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇంతకాలం కష్టపడి నిర్వహించిన నెట్‌వర్క్ ఆసుపత్రులు… ఇప్పుడు కొనసాగించలేని స్థితిలో ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు నెలల తరబడి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అసెంబ్లీలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆసుపత్రుల బకాయిల వివరాలు వెల్లడించినా, డబ్బులు మాత్రం రాలేదని సంఘం ఆరోపించింది. గత వారం రోజులుగా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయిందని పేర్కొంది.
అందువల్ల రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నామని, దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆసుపత్రుల సంఘం సూచించింది. ఏడాది కాలంగా తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరింది.