తూపల్లిలో దాహం దాహం
- 8 రోజుల కిందట పైప్ లైన్ పగిలింది
- ఏ ఒక్క అధికారీ నిక్కి చూడలేదు
( శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ ) : శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai District) కదిరి నియోజకవర్గం తలుపుల మండలం, తలుపుల పంచాయితీ తూపల్లి దళితవాడ జనం గుక్కెడు నీళ్లు కోసం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా తాగునీటి కోసం ఈ వాడ జనం తహతహలాడుతున్నారు. ఈ విషయం తెలిసినా.. ఒక్క అధికారి కూడా ఈ దళితవాడ వైపు నిక్కిచూడలేదు.. అసలు ఏం జరిగిందంటే.. ఈ దళితవాడలో పైపులైన్ పగిలిపోయింది. నీటి సరఫరా నిలిచిపోయింది.
8 రోజులుగా తాగునీటి కోసం ఈ దళితులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఏ అధికారి కూడా ఈ వాడకు రాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇంతకు ముందే.. ఎంపీడీవో (MPDO) కు, పంచాయతీ సెక్రెటరీ కి తెలియజేసినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంటి పన్నుకు, నీటి పన్ను, లైబ్రరీ పన్నులు అంటూ వెంట పడి మరీ వసూలు చేస్తుంటారు. తాగునీటి సమస్య ను మాత్రం పట్టించుకోవడం లేదు. పైపులు పగిలిపోయిన విషయాన్ని అధికారికి ఫోన్ చేసి, స్వయంగా చెప్పినా కూడా పట్టించుకోలేదు. ప్లీజ్ .. కలెక్టర్జీ… తూపల్లి దళితవాడ జనం దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

