పోలీస్ బాస్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణకు ఆరవ డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

పింక్ బుక్, రెడ్ బుక్, బ్లూ బుక్ అంటూ ఏదీ లేదని మేము అనుసరించేది కేవ‌లం ఖాకీ బుక్ మాత్ర‌మే అని తెలంగాణ నూత‌న‌ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టంచేశారు. సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియాలో) ఇతరుల వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తొలి ఛాలెంజ్..

తెలంగాణ ప్రభుత్వం తనపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలియజేసిన శివధర్ రెడ్డి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. తాను ఎదుర్కోబోయే మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలు.. అదే మొదటి టార్గెట్ అని పేర్కొన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి అవాంతరాలు లేకుండా శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సన్నద్ధం అవుతున్నామని వెల్లడించారు.

పోలీస్ వ్యవస్థ బలోపేతం..

పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో సుమారు 17 వేల ఖాళీలు ఉన్నాయని, వాటిని నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, బేసిక్ పోలీసింగ్‌ను ఆధునిక సాంకేతికతను (టెక్నాలజీని) ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

సైబర్ సెక్యూరిటీ & ఈగల్ టీంలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్‌ను (పర్యవేక్షక వ్యవస్థను) మెరుగుపరుస్తామని తెలిపారు.

మావోయిస్టులకు విజ్ఞప్తి..

మావోయిస్టుల అంశంపై మాట్లాడుతూ, వారిలో మార్పు వచ్చిందని తెలిపారు. ఇప్పటికే చాలా మంది పార్టీ నుండి బయటకు వస్తున్నారని, ఇటీవల సెంట్రల్ కమిటీ మెంబర్ కవితక్క కూడా లొంగిపోయారని తెలిపారు. పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని ఆయన విజ్ఞప్తి (కోరిక) చేశారు.

Leave a Reply