• క్రమశిక్షణే ధ్యేయం
  • చట్టాన్ని గౌరవిస్తాం
  • వర్సిటీలో జీరో టాలరెన్స్ పాలసీ ఉంది


హైదరాబాద్ : మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని వైస్ ఛాన్సలర్ డా.యాజులు మేడూరి తెలిపారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు నగరవ్యాప్త నార్కోటిక్స్ కేసులో ప్రమేయమైందని వెలువడిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. మత్తుపదార్థాల వినియోగం, కలిగి ఉండటం లేదా పంపిణీ చేయడాన్ని విశ్వవిద్యాలయం ఖండిస్తుందన్నారు.

మహీంద్రా యూనివర్సిటీ జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే లేదా త‌మ విద్యార్థి సమాజం భద్రత, సంక్షేమాన్ని ప్రమాదంలోకి నెట్టే ఏ చర్యకైనా విశ్వవిద్యాలయ నియమావళి, వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠినమైన శిక్షలు విధించబడతాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు తాము పూర్తిగా సహకరించామన్నారు. సమస్య వేగంగా, సముచితంగా పరిష్కారమయ్యేలా అన్ని విధాలా సహాయాన్ని అందించామన్నారు. త‌మ సంస్థ విలువలు, సమగ్రతను కాపాడటానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటూ, సురక్షితమైన, బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.

ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందగల సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి తాము అంకితభావంతో ఉన్నామన్నారు. ఉన్నత విద్యాసంస్థగా, మత్తుపదార్థాల వినియోగ ప్రమాదాలు, చట్టపాలన ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు త‌మ విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుని మహీంద్రా యూనివర్సిటీ ప్రతిపాదించే విలువలను కాపాడాలని తాము కోరుకుంటున్నామన్నారు.

Leave a Reply