తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై తీసుకువచ్చిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ మార్వెల్ మూవీ ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ (2017). ఈ రెండు చిత్రాలు విడుదలై దాదాపు 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ, మేకర్స్ ఈ రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ కొత్త వెర్షన్‌కు ‘బాహుబలి: ది ఎపిక్’ అనే టైటిల్ పెట్టి తాజాగా టీజర్ విడుదల చేశారు.
అయితే రెండు సినిమాలను ఒకే ఫ్రేమ్‌లో, ఒకే రిథమ్‌లో చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.
‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లు వసూలు చేయగా, ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వసూళ్లు అద్భుతంగా రూ.1,788 కోట్లకు చేరాయి. ఇప్పుడు ఈ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా మళ్లీ విడుదల చేయడం అభిమానులకు పండగ వంటిదే. బాహుబలి 10 ఏళ్ల వేడుకల సందర్భంగా తెరపైకి రాబోతున్న ఈ ఎపిక్.. మరోసారి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా లేదా అనేది సినీ ప్రేమికులందరిలో హాట్ టాపిక్‌గా మారింది.