అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి గత 14 నెలలుగా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమేనని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, అధికారులు ఈ దిశగా మరింత కృషి చేయాలని సూచించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ప్రతి సంవత్సరం డీఎస్సీ..
టీచర్ పోస్టుల భర్తీకి ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల విలువైన సమయం వృథా కాకుండా అనవసరమైన శిక్షణా కార్యక్రమాలను తగ్గించాలని ఆయన అధికారులకు సూచించారు.
అసర్ నివేదిక ప్రకారం ప్రస్తుతానికి ఏపీ జాతీయస్థాయిలో 14వ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. ఈ ర్యాంక్‌ను మెరుగుపరచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి బిడ్డకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) హక్కుగా అందిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకూ ఈ హక్కు చేరేలా చూడాలని సూచించారు.
తల్లికి వందనం – ఫీజు రీయింబర్స్మెంట్
తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశామని లోకేష్ అన్నారు. చివరి విడతలో పెండింగ్ దరఖాస్తులకు రూ.325 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా 2024–25 ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
పాఠశాలల దత్తతకు ప్రత్యేక వెబ్సైట్
నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు భూసేకరణలో దాతల సహకారం తీసుకోవాలని లోకేష్ సూచించారు. అంతేకాక, గ్రామాల్లోని పాఠశాలలను దత్తత తీసుకునేలా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. దేశ, విదేశాల్లోని ప్రముఖులు, కార్పొరేట్ సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు.
అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఆధునిక సైన్స్ సెంటర్లను త్వరగా ప్రారంభించాలని లోకేష్ ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 125 ఆటిజం కేంద్రాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, ఏడాదిలోపు పూర్తి చేయాలని కూడా ఆయన సూచించారు.
సెంట్రల్ లైబ్రరీ ప్రాజెక్టులు, లైబ్రరీల అభివృద్ధికి చర్యలు
దేశంలోనే అత్యుత్తమ సెంట్రల్ లైబ్రరీని అమరావతిలో నిర్మించనున్నట్లు లోకేష్ తెలిపారు. 2 లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేసి, ఏడాదిలో పూర్తిచేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో 50 వేల చదరపు అడుగుల్లో రీజనల్ లైబ్రరీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లైబ్రరీలను అనుసంధానించే సాఫ్ట్వేర్, వెబ్సైట్ అభివృద్ధి చేయాలని లోకేష్ ఆదేశించారు.
స్థానిక సంస్థల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.213 కోట్లు రాబట్టి లైబ్రరీల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరీ నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రాజమండ్రి లైబ్రరీకి రూ.87 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. లైబ్రరీల వల్ల ఇప్పటికే 350 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు.
నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్ష
నైపుణ్యాభివృద్ధి పోర్టల్‌ను దేశానికి రోల్ మోడల్‌గా అభివృద్ధి చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా ప్రతి ఏడాది 50 వేల యువతకు శిక్షణ కల్పించనున్నట్లు వివరించారు. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో నైపుణ్య పోర్టల్‌ను అనుసంధానం చేశామని తెలిపారు.

